Revanth Reddy: టీపీసీసీ చీఫ్ పదవి రావడానికి ఆయనే కీలకం: రేవంత్ రెడ్డి

Revanth Reddy speech at Bodhan constituency meeting

  • సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారన్న రేవంత్
  • రైతు దీక్ష విజయం ఢిల్లీ వరకు చేరిందని వెల్లడి
  • టీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు
  • బోధన్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగం

తనకు టీపీసీసీ చీఫ్ పదవి రావడంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి చెప్పారు. కొంపల్లిలోని పీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో జరిగిన బోధన్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వెనుక మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని వివరించారు.

‘‘నిజామాబాద్‌లో చేసిన రాజీవ్‌ రైతు దీక్ష విజయవంతమైంది. ఈ విషయం అధిష్ఠానం వరకూ చేరింది. అందుకే నాకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కింది’’ అని రేవంత్ అన్నారు.

ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కూడా ఆయన విమర్శలు చేశారు. మూతపడిపోయిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, 100 రోజుల్లో ఈ పని చేసి చూపిస్తామని హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి సింగిల్‌ విండో డైరెక్టర్‌గా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

దళితబంధు పథకాన్ని కాంగ్రెస్‌ ఒకపక్క ప్రశ్నిస్తుంటే.. ఓడిపోతామని భయపడుతున్న కేసీఆర్‌ మరోసారి తెలంగాణ, ఆంధ్రా అంటూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని ప్లాన్ వేస్తున్నారని విమర్శించారు.

అదే విధంగా వట్టి అబద్ధాలు చెప్పి నిజామాబాద్‌లో ఒకసారి గెలిచిన కవిత కూడా హామీలు నిలబెట్టుకోలేదని, అందుకే రైతులు నామినేషన్‌ వేసి మరీ ఆమెను ఓడగొట్టారని రేవంత్ అన్నారు.

బీజేపీపై కూడా విమర్శలు చేసిన రేవంత్.. ఎంపీ అరవింద్‌‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పసుపు బోర్డు తెస్తానని ప్రజలను అరవింద్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే గజ్వేల్‌, నిజామాబాద్‌లలో భారీ సభలు ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News