US court: అమెరికా కోర్టు సంచలన తీర్పు.. కుమారుడికి తల్లిదండ్రులే 22 లక్షలు కట్టాలన్న జడ్జి!
- కుమారుడి పోర్నోగ్రఫీ కలెక్షన్ పారేసిన తల్లిదండ్రులు
- మిచిగాన్‌లో వింత ఘటన
- కోర్టుకెక్కిన 43 ఏళ్ల కుమారుడు
- గతేడాది డిసెంబరులో కేసు
- 8 నెలల తర్వాత వెలువడిన సంచలన తీర్పు
అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన జరిగింది. 43 ఏళ్ల కుమారుడి నీలిచిత్రాలు (పోర్నోగ్రఫీ) కలెక్షన్ పారేసినందుకు తల్లిదండ్రులు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని మిచిగాన్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కుమారుడికి 30,441 డాలర్లు (అంటే సుమారు రూ.22.37లక్షలు) చెల్లించాల్సిందిగా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ మలోని తీర్పిచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మిచిగాన్కు చెందిన డేవిడ్ వర్కింగ్(43) అనే వ్యక్తి ఇటీవలే భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలు తల్లిదండ్రుల వద్ద ఉందామని వచ్చాడు. ఒక పది నెలల తర్వాత తిరిగి వెళ్లిపోవాలనేది అతని ప్లాన్. అయితే అలా తల్లిదండ్రుల వద్ద ఉండగా.. తాను ఏళ్లతరబడి సేకరించిన పోర్నోగ్రఫీ కలెక్షన్ దాచిన అట్టపెట్టెలు అతనికి కనిపించలేదు.
అవెక్కడున్నాయా? అని ఆరా తీయగా తల్లిదండ్రులు తామే వాటిని పారేశామని చెప్పారు. దీంతో అతని గుండె పగిలినంత పనైంది. ఆగ్రహంతో ఊగిపోయిన డేవిడ్.. తల్లిదండ్రులపై కోర్టులో పిటిషన్ వేశాడు. 8 నెలల క్రితం ఈ కేసు నమోదైంది. తాను ఏళ్ల తరబడి సేకరించిన పోర్నోగ్రఫీ కలెక్షన్ ధర 29వేల డాలర్లు (సుమారు రూ.21లక్షల) వరకూ ఉంటుందని కోర్టుకు డేవిడ్ చెప్పాడు. తల్లిదండ్రుల ఇంటి నుంచి ఇండియానాలోని మూనిస్కు వెళ్లిపోవాలని అనుకున్న తరుణంలో అతనికి ఈ షాక్ తగిలిందట. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో డేవిడ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు తీర్పు వెల్లడించింది. సదరు తల్లిదండ్రులు డేవిడ్‌కు 30వేల డాలర్లు (రూ.22.37లక్షలు) నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జడ్జి ఆదేశించారు.