Taliban: భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని తాలిబన్ అగ్రనేత ప్రకటన!
- రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కొనసాగిస్తాం
- ఆఫ్ఘన్‌కు భారత్ ముఖ్యమైన దేశం
- ఆఫ్ఘన్‌లో చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసింది
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో సత్సంబంధాల కొనసాగింపుపై తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తొలిసారి స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు.
భారత్‌తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. అంతేగాక, భారత్ ఆఫ్ఘన్‌కు ముఖ్యమైన దేశమని తెలిపారు. ఈ మేరకు తాలిబన్ సోషల్ మీడియా ఖాతాలో ఆయన వీడియో విడుదల చేశారు.
ఆఫ్ఘన్‌లో చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిందని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ గుర్తు చేసుకున్నారు. కాగా, పలు గ్రూపులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆఫ్ఘన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.
తమ ప్రభుత్వంలో విభిన్న వర్గాల ప్రజల ప్రాతినిధ్యం ఉంటుందని షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ పేర్కొన్నారు. షరియా ఆధారిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పాకిస్థాన్, చైనా, రష్యాలతో పాటు పలు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.