vaccine: రేపటి నుంచి వ్యాక్సిన్ దొరకదంటూ వదంతులు.. ఆరోగ్య కేంద్రానికి పోటెత్తిన జనం!
- నిజామాబాద్, నవీపేట్ మండలంలో ఘటన
- వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్ కూడా ఇవ్వబోరని వదంతులు
- క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలు
'నిజం గడప దాటేలోపు.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది' అంటారు. వదంతులు ఎంత త్వరగా వ్యాప్తి చెందుతాయో తెలిపేందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. కరోనా వ్యాక్సిన్లపై ఎన్నో అసత్య ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే వ్యాక్సిన్ తీసుకోకపోతే రేషన్ నిలిపేస్తారని నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో ప్రచారం జరిగింది.
అంతేగాక, రేపటి నుంచి వ్యాక్సిన్లు అందుబాటులో ఉండవని, ఈ రోజే చివరిరోజని కొందరు వదంతులు వ్యాప్తి చేశారు. దీంతో ఈ రోజు ఒక్కసారిగా 700 మందికి పైగా ప్రజలు స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైనల్లో నిల్చుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు 500 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.