Corona Virus: భయపెట్టే కొత్త కరోనా వేరియంట్.. వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే సామర్థ్యం!
- శాస్త్రవేత్తలను భయపెడుతున్న c.1.2 కరోనా వేరియంట్
- తొలిసారి దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్
- ఆగస్టు 13 నాటికి చైనా సహా మరిన్ని దేశాల్లో వ్యాప్తి
- మిగతా వేరియంట్ల కన్నా ఎక్కువగా జన్యుమార్పులు
ఇప్పటికే రకరకాల వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరో కొత్త కరోనా వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. c.1.2గా పిలుస్తున్న ఈ కరోనా వేరియంట్ ఈ ఏడాది మే నెలలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిందట. ఆగస్టు 13 నాటికి చైనా, స్విట్జర్లాండ్, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్ తదితర దేశాలకూ ఈ వేరియంట్ వ్యాపించింది.
కరోనా మొదటి వేవ్ సమయంలో దక్షిణాఫ్రికాలో విజృంభించిన c.1 కరోనా వేరియంట్.. మరిన్ని జన్యుమార్పులు జరగడంతో c.1.2గా మారినట్లు నిపుణులు వివరిస్తున్నారు. ఈ వేరియంట్‌ను మే నెలలో తొలిసారిగా గుర్తించినట్లు దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్ఐసీడీ), క్వాజులూ-నాటల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫాం(కేఆర్ఐఎస్పి) సంస్థలు ప్రకటించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్లతో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్లో మరిన్ని ఎక్కువ జన్యుమార్పులు (మ్యూటేషన్లు) జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డేటాను బట్టి ఈ వేరియంట్ వ్యాప్తిని, ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమని అంటున్నారు. ఇప్పటికే పరిశోధకులు గుర్తించిన ఎన్440కె, వై449హెచ్ వంటి మ్యూటేషన్లు.. వ్యాక్సిన్ తీసుకుంటే మన శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
ఇప్పుడు బయటపడిన c.1.2 వేరియంట్లో కూడా ఈ సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మిగతా వేరియంట్లతో పోలిస్తే c.1.2లో రెట్టింపు వేగంతో జన్యుమార్పులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.