Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మిలిటరీ ఆపరేషన్ ముగియడంతో దౌత్యపర మిషన్ మొదలు కానుంది: అమెరికా
- దౌత్యపరంగా ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమించాం
- ఇక దౌత్య సంబంధాలను ఖతార్ నుంచి నిర్వహిస్తాం
- అమెరికా, ఆఫ్ఘన్ మధ్య సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది
- ఆ దేశ ప్రజలకు సాయం చేస్తూనే ఉంటాం
ఆఫ్ఘన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగి వెళ్లడంతో ఇక దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించినట్లు అయిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు.
ఇకపై తాము దౌత్య సంబంధాలను ఖతార్ నుంచి నిర్వహిస్తామని వివరించారు. మిలిటరీ ఆపరేషన్ ముగియడంతో దౌత్యపర మిషన్ మొదలుకానుందని తెలిపారు. అమెరికా, ఆఫ్ఘన్ మధ్య సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుందని వివరించారు. ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆ దేశ ప్రజలకు సాయం చేస్తూనే ఉంటామని చెప్పారు.
ఈ సాయం తమ నుంచి ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబన్ సర్కారు ద్వారా కాకుండా, ఐక్య రాజ్యసమితి, ఎన్జీవోల వంటి సంస్థల ద్వారా అందనుందని వివరించారు. ఆఫ్ఘన్ ను వీడాలనుకున్న అమెరికన్లతో పాటు ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు.
అయితే, అమెరికా పౌరులు కొందరు ఆఫ్ఘన్‌లోనే చిక్కుకుపోయారని ఆయన చెప్పారు. వారిని అమెరికాకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆఫ్ఘన్‌లోని తాలిబన్లు ఆంక్షలు విధించకూడదని చెప్పారు. ఆ దేశంలోని మహిళలు, మైనార్టీ హక్కులను కాపాడాలని అన్నారు.