Sharmila: సీఎం కేసీఆర్ నియోజక వర్గంలో నిరాహార దీక్షకు దిగిన షర్మిల
- ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’
- ఈ రోజు సాయంత్రం వరకు దీక్ష
- ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మండలంలోని అనంతరావుపల్లి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’ కొనసాగనుంది. దీక్షకు దిగే ముందు అనంతరావుపల్లికి చెందిన నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఉద్యోగం రాలేదని ఆయన కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ, ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారు. తెలంగాణలో పూర్తిస్థాయిలో లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ పరిష్కరించేవరకు తాను నిరుద్యోగుల తరఫున పోరాడతానని చెప్పారు.