Taliban: మర్యాదగా లొంగిపోండి... లేకపోతే చంపేస్తాం: తాలిబన్ల లేఖలు
- అమెరికాకు సహకరించిన ప్రతి ఒక్కరూ లొంగిపోవాలంటూ లేఖలు
- బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు లేఖలు అంటించిన తాలిబన్లు
- లొంగిపోని వారికి మరణశిక్షను విధిస్తామని హెచ్చరిక
ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు సంపూర్ణంగా వైదొలగాయి. ఆ వెంటనే కాబూల్ ఎయిర్ పోర్టును కూడా తాలిబన్లు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం తాలిబన్లు అసలైన పనిని ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్ లతో పాటు వాటి మిత్ర బృందాలకు సహకరించిన వారిని నిర్మూలించే పనిలో పడ్డారు. వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ మర్యాదగా లొంగిపోవాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పకుండా... బహిరంగ ప్రదేశాల్లో లేఖలను అంటించారు.
బహిరంగ ప్రదేశాలతో పాటు చాలా ఇళ్లకు ఈ లేఖలు అంటించారని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. అమెరికా, దాని మిత్ర దేశాలకు మద్దతు ఇచ్చిన వారు వెంటనే కోర్టు ముందు లొంగిపోవాలని... లేకపోతే మరణశిక్షను అమలు చేస్తామని లేఖలో తాలిబన్లు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఓ వ్యక్తి మాట్లాడుతూ, హెల్మాండ్ ప్రావిన్స్ లో బ్రిటన్ ఆర్మీ రోడ్లను నిర్మించిందని... ఈ సమయంలో తమ ప్రాంత అభివృద్ధి కోసం తాను సహాయం చేశానని తెలిపాడు. అయితే, తాను ఆ విషయాలను బయటకు చెప్పదలుచుకోలేదని... బయట కూడా ఇకపై పెద్దగా కనిపించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తనకు బతకాలని ఉందని అన్నాడు.