Taliban: అమెరికా హెలికాప్టర్ లో తాలిబన్ల గగనవిహారం... హెలికాప్టర్ కు వేళ్లాడుతున్న వ్యక్తి దేహం!
- ఆఫ్ఘన్ లోనే పలు అమెరికా హెలికాప్టర్లు
- ఒకదాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు
- వెలుగులోకి వచ్చిన వీడియో
- కాందహార్ లో పహారా కాస్తున్నారన్న తాలిబ్ టైమ్స్
- వ్యక్తిని ఉరితీశారన్న రిపబ్లికన్ సెనేటర్
రెండు దశాబ్దాల ప్రస్థానానికి ముగింపు పలుకుతూ అగ్రరాజ్యం అమెరికా కల్లోలభరిత ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలగింది. అయితే అమెరికాకు చెందిన పలు హెలికాప్టర్లు ఇప్పటికీ ఆఫ్ఘన్ లో కొన్ని మిగిలే ఉన్నాయి. తాజాగా, ఓ అమెరికా హెలికాప్టర్ లో తాలిబన్లు ప్రయాణిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ లో ఆ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా, ఆ హెలిక్టాపర్ కు ఓ మానవ దేహం వేళ్లాడుతుండడం వీడియోలో కనిపించింది. దీనిపై తాలిబన్లకు చెందిన 'తాలిబ్ టైమ్స్' ట్విట్టర్ లో స్పందించింది. "ఇది మా ఎయిర్ ఫోర్స్. ఇస్లామిక్ ఎమిరేట్స్ కు చెందిన వాయుసేన హెలికాప్టర్ కాందహార్ నగరంపై తిరుగుతూ పహారా కాస్తోంది" అని వివరించింది.
అయితే, అమెరికా చట్టసభ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రజ్ దీనిపై తీవ్రస్థాయిలో స్పందించారు. "జో బైడెన్ ఆఫ్ఘనిస్థాన్ లో సృష్టించిన విపత్తును ఈ భయానక దృశ్యం సోదాహరణంగా వివరిస్తుంది. తాలిబన్లు ఓ వ్యక్తిని అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్ నుంచి ఉరితీశారు. విషాదకరం... ఊహించలేని ఘటన" అని టెడ్ క్రజ్ పేర్కొన్నారు.