Rare fish: వలకు చిక్కిన 157 అరుదైన చేపలు.. వేలం వేస్తే రూ.1.3 కోట్ల ధర!
- ముంబై జాలరిని కోటీశ్వరుడిని చేసిన చేపలు
- ఘోల్ జాతి చేపలకు వేలంలో భారీ ధర
- మొత్తం 157 చేపలు.. ఒక్కోటి రూ.85వేలు
సుమారు నెల రోజుల తర్వాత ముంబైలోని జాలర్లకు పని మొదలైంది. ఇటీవలి కాలంలో మహారాష్ట్రను తుపానులు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడ చేపల వేటను తాత్కాలికంగా నిలిపేశారు. మళ్లీ తాజాగా చేపలు పట్టడానికి వెళ్లేందుకు జాలర్లకు అనుమతులు లభించాయి.
దీంతో చేపల వేటకు వెళ్లిన చంద్రకాంత్ తారే అనే జాలరి అదృష్టం గజ్జెలు కట్టుకొని ఆడింది. ఘోల్ జాతికి చెందిన చేపలు అతని వలకు చిక్కాయి. ఆ చేపలు వలకు చిక్కడంతో చంద్రకాంత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎందుకంటే ఈ చేపలు మార్కెట్లో మంచి ధర పలుకుతాయి.
అతను ఒడ్డుకు రావడానికి ముందే ఈ విషయం జాలర్లలో దుమారం రేపింది. ఒడ్డుకు వచ్చిన చంద్రకాంత్.. తన చేపలను వేలం వేయడానికి రెడీ అయ్యాడు. అంతే.. వ్యాపారులు క్యూలు కట్టేశారు. దీంతో ఒక్కో చేప సుమారు రూ.85 వేల ధర పలికింది. చంద్రకాంత్ వలకు మొత్తం 157 చేపలు చిక్కాయి. అంటే అతను మొత్తమ్మీద 1.33 కోట్ల రూపాయలపైగా సంపాదించాడన్నమాట. దీంతో నెల రోజుల తర్వాత సముద్రం మీదకెళ్లిన చంద్రకాంత్.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు. ఇదంతా చూసిన మిగతా జాలర్లు.. అదృష్టమంటే చంద్రకాంత్దే అంటున్నారు.