CPS: ‘పింఛను విద్రోహ దినం’ పేరుతో కదం తొక్కిన ప్రభుత్వ ఉద్యోగులు.. జగన్ సర్కారు నమ్మకం ద్రోహం చేసిందంటూ ఆక్రోశం
- సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లోనే రద్దు చేస్తామని జగన్ హామీ
- ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీల మద్దతు
- సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ 109 సార్లు హామీ ఇచ్చారన్న ‘సీపీఎస్’ రాష్ట్ర అధ్యక్షుడు
తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తానన్న జగన్ ఆ తర్వాత నమ్మకం ద్రోహం చేశారంటూ ఏపీలోని ఉద్యోగులు, టీచర్లు విరుచుకుపడ్డారు. జగన్ తమను నమ్మించి మోసం చేశారంటూ ‘పింఛను విద్రోహ దినం-నయవంచన’ పేరుతో నిన్న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. వీరికి ఇతర ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, సీపీఐ మద్దతు ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) పిలుపు మేరకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ 109 సార్లు హామీ ఇచ్చారని, ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామాంజనేయులు యాదవ్ డిమాండ్ చేశారు. జగన్ తన హామీని నిలబెట్టుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఫ్యాప్టో చైర్మన్ జోసెఫ్ సుధీర్ బాబు అన్నారు.