Corona Virus: కరోనా నుంచి కోలుకున్న వారిలో కిడ్నీల సమస్య.. తాజా అధ్యయనంలో వెల్లడి
- కరోనా సోకిన ఆరు నెలల్లోనే కిడ్నీ సమస్యలు
- వైరస్ సోకినా హాస్పిటల్లో చేరని వారికి వచ్చే ప్రమాదం అధికం
- కొత్త అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయం
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 కోట్లమందికి సోకి, అన్ని దేశాలనూ వణికిస్తున్న మహమ్మారి కరోనా. ఇది సోకిన తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ చాలా దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది.
కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా సోకిన తర్వాత ఇంటి వద్దే చికిత్స తీసుకునే వారికి కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వారికి గనుక కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉందట.
ఈ మేరకు అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ జర్నల్లో ఒక పరిశోధన ప్రచురితమైంది. కరోనా మహమ్మారి వల్ల వచ్చే మరో తీవ్రమైన సమస్య ఇదని నిపుణులు అంటున్నారు. ప్రతి 10 వేల మందిలో సుమారు 7.8 మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు సెయింట్ లూసియానాలోని వెటరన్ ఎఫైర్స్ కార్యాలయంలో పనిచేసే జియాద్ అల్ అలీ తెలిపారు. ఆయనే ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
‘‘కరోనా సోకిన అమెరికన్లు, ప్రపంచ వ్యాప్త బాధితులతో పోల్చి చూస్తే ఇదేమీ తక్కువ సంఖ్య కాదు’’ అని జియాద్ అన్నారు. కిడ్నీ సమస్యలో అత్యంత సమస్యాత్మకమైన విషయం ఏంటంటే.. ఈ కిడ్నీ సమస్యను గుర్తించడం చాలా కష్టం. కనీసం నొప్పి కూడా పుట్టదట. ఇది ముదిరిన తర్వాత డయాలసిస్, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరం అవుతాయి. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారికంటే, ఆస్పత్రిలో చేరకుండా ఇంట్లోనే చికిత్స పొందిన వారికి ఈ సమస్య వచ్చే అవకాశం 23 శాతం అధికంగా ఉన్నట్లు జియాద్ తెలిపారు. అది కూడా కరోనా నుంచి కోలుకున్న 6 నెలలకే ఈ కిడ్నీ సమస్య మొదలవుతోందని ఆయన పేర్కొన్నారు.