Northern Alliance: తాలిబన్లతో పంజ్ షీర్ వీరుల హోరాహోరీ పోరాటం... వీడియో ఇదిగో!
- తాలిబన్లకు లొంగనంటున్న పంజ్ షీర్
- పోరాటమే ఊపిరిగా నార్తర్న్ అలయెన్స్
- అదనపు దళాలను తరలిస్తున్న తాలిబన్లు
- తీవ్ర ప్రతిఘటన.. తాలిబన్లకు చావుదెబ్బ
ఆఫ్ఘనిస్థాన్ దురాక్రమణను పరిపూర్ణం చేయాలని భావిస్తున్న తాలిబన్లకు పంజ్ షీర్ ప్రాంతం సవాలు విసురుతోంది. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న తాలిబన్లు అక్కడికి అదనపు దళాలను తరలిస్తున్నారు. అయితే పర్వత ప్రాంత పోరాటాల్లో ఆరితేరిన నార్తర్న్ అలయన్స్ దళాల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇటీవల జరిగిన పోరాటంలో తాలిబన్ల వైపు 300 మందికి పైగా హతులయ్యారన్న వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో, తాలిబన్లను కొండల పైనుంచి ముట్టడించిన నార్తర్న్ అలయన్స్ యోధులు గుళ్ల వర్షం కురిపిస్తున్న వీడియో విడుదలైంది. కింద లోయలో తాలిబన్లు చిక్కుకుపోగా, పైనుంచి పంజ్ షీర్ యోధులు నిప్పుల వర్షం కురిపించడం ఈ వీడియోలో చూడొచ్చు.
కాగా పంజ్ షీర్ ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడు బాబా అస్లామ్ కూడా తాలిబన్లకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టడం అక్కడి ప్రజల తెగువకు నిదర్శనం అని చెప్పాలి. స్వేచ్ఛ కోసం పోరాడేందుకు వయసుతో పనేముందని బాబా అస్లామ్ అంటున్నాడు. గతంలో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా మొదటిసారి తుపాకీ పట్టిన అస్లామ్ ఆపై తాలిబన్లతోనూ కలిసి పనిచేశాడు. అయితే గత 20 ఏళ్లుగా పంజ్ షీర్ ప్రావిన్స్ లో ఎలాంటి చీకూచింతా లేకుండా జీవిస్తున్నాడు. దేశంలో మళ్లీ తాలిబన్ల పాలన వస్తుండడం, పైగా వారు తమ ప్రాంతంపై దండెత్తుతుండడం వంటి కారణాలతో అస్లామ్ మళ్లీ తుపాకీ పట్టాల్సి వచ్చింది.