Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్.. సిల్వర్ మెడల్ సాధించిన ప్రవీణ్ కుమార్
- హైజంప్ లో రజత పతకాన్ని సాధించిన ప్రవీణ్ కుమార్
- 2.07 మీటర్ల జంప్ తో మెడల్ సాధించిన ప్రవీణ్
- ఇప్పటి వరకు 11 పతకాలను సాధించిన భారత్
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈరోజు జరిగిన టీ64 హైజంప్ లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్ తో ఆయన సిల్వర్ ను సాధించాడు. 2.10 మీటర్ల జంప్ తో బ్రిటన్ కు చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతేకాదు, సరికొత్త ఆసియన్ రికార్డును కూడా నెలకొల్పాడు. ప్రవీణ్ సాధించిన మెడల్ తో కలిపి భారత్ ఇప్పటి వరకు 11 పతకాలను సాధించింది. వీటిలో రెండు స్వర్ణ, ఆరు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.
ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే... ఆయనకు ఒక కాలు మరొక కాలుకన్నా పొడవు తక్కువగా ఉంది. చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల ఆసక్తిని కనబరిచిన ఆయన... తొలి రోజుల్లో వాలీబాల్ పై మక్కువ చూపాడు. శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారితో హై జంప్ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే, శారీరక లోపాలు ఉన్నవారికి ప్రత్యేకంగా పోటీలు ఉన్నాయనే విషయం ఆ ఈవెంట్ సందర్భంగా తెలుసుకున్నాడు. డాక్టర్ సత్యపాల్ సింగ్ వద్ద ఆయన శిక్షణ తీసుకున్నాడు. దుబాయ్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకాన్ని సాధించి, ఆసియా రికార్డును సాధించాడు. ఇప్పుడు ఒలింపిక్స్ లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు.