Afghanistan: చైనా మా కీలక భాగస్వామి.. తాలిబన్ల ప్రకటన
- పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న డ్రాగన్ కంట్రీ
- ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి మద్దతిస్తుందన్న తాలిబన్ ప్రతినిధి
- చైనా ప్రతిపాదించిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’కు తాలిబన్ల మద్దతు
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. కమ్యూనిస్టు దేశం చైనా తమ కీలక భాగస్వామి అని ప్రకటించారు. ఆఫ్ఘన్లో పెట్టుబడులు పెట్టడానికి డ్రాగన్ దేశం సిద్ధంగా ఉందని తాలిబన్లు చెప్పారు. ఆఫ్ఘన్ పునర్నిర్మాణం కోసం తాము చైనా సాయం తీసుకుంటామని స్పష్టంచేశారు.
యుద్ధంతో చాలా నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే, ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడేందుకు చైనా సాయం తీసుకుంటామని, ఆ సహకారంతో దేశంలోని రాగి నిల్వలను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని తాలిబన్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. చైనా చేసిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని ప్రకటించారు.
‘‘చైనా మా దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, పునర్నిర్మాణంలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇది మాకు అద్భుతమైన అవకాశం. అందుకే చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి’’ అని ఆయన పేర్కొన్నారు.