Telangana: ఓ సోదరుడిలా కిషన్ రెడ్డి నన్ను చూసుకున్నారు: మంద కృష్ణ
- ఇటీవల బాత్రూంలో జారిపడిన మంద కృష్ణ
- ఇవాళ ఆయన్ను పరామర్శించిన కిషన్ రెడ్డి
- ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారని కేంద్రమంత్రి ప్రశంస
- లక్ష్య సాధనలో ఇలాగే ముందుకెళ్లాలని ఆకాంక్ష
ఇటీవల బాత్రూంలో జారిపడి చికిత్స పొందిన మంద కృష్ణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ పోరాడుతున్నారని, ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని కిషన్ రెడ్డి కొనియాడారు. లక్ష్య సాధనలో ఇలాగే ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
కాగా, కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడిగా కిషన్ రెడ్డి ఎంతో అండగా నిలిచారని మంద కృష్ణ అన్నారు. ఎన్నో సందర్భాల్లో తన బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యా మంచి బంధమే ఉందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పటికైనా ఆ పని చేయాలని చురకలంటించారు. రెండేళ్లలోనే దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.