Afghanistan: శరణార్థులను విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
- ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
- 1000 మంది కొన్ని రోజులపాటు విమానాశ్రయంలో పడిగాపులు
- ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు రావాలన్న తాలిబన్ల ఆహ్వానంపై చైనా మౌనం
ఆప్ఘనిస్థాన్ నుంచి వేలాదిమంది శరణార్థులను తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు విమానాలను ఇటీవల తాలిబన్లు అడ్డుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబూల్లో చిక్కుకుపోయిన అమెరికా సహా ఇతర దేశాల పౌరులు, బలగాలు, ఆఫ్ఘన్ శరణార్థులను తరలించేందుకు గత నెలలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బల్ఖ్ ప్రావిన్సులోని మజార్-ఎ-షరీఫ్ నుంచి వందలాదిమంది శరణార్థులను విదేశాలకు తరలించేందుకు ఆరు విమానాలను సిద్ధం చేశారు.
అయితే, ఆ విమానాలు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారని అధికారి ఒకరు తెలిపారు. దీంతో దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని కూడా ఆయన వివరించారు.
ఇదిలావుంచితే, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు హాజరు కావాల్సిందిగా తాలిబన్ల నుంచి వచ్చిన ఆహ్వానంపై చైనా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందిస్తూ.. ఈ విషయంపై తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.