Rajanna Sircilla District: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. జలదిగ్బంధంలో సిరిసిల్ల
- భారీ వర్షంతో సిరిసిల్ల పట్టణం అతలాకుతలం
- దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలోనే
- కలెక్టరేట్‌లోకీ నీళ్లు
- విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. దీంతో వినాయక చవితి కోసం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన విగ్రహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
మరోవైపు, బోనాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలు భయపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, శాతవాహన వర్సిటీలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు, కలెక్టరేట్‌లోకి నీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు.