Nagarjuna Sagar: నిండు కుండలా నాగార్జునసాగర్
- నాగార్జునసాగర్ కు పోటెత్తుతున్న వరదనీరు
- 587.50 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- డ్యామ్ లో 305.8030 టీఎంసీల నీరు
ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ కు వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులకు చేరింది. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 305.8030 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 17,062 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 16,372 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా మళ్లీ వరద నీరు పెరుగుతోంది. ప్రస్తుతం 1,31,833 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 57,514 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 874.50 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 161.2918 టీఎంసీల నీరు ఉంది. కుడిగట్టు (ఏపీ) విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోగా... ఎడమగట్టు (తెలంగాణ) కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.