NIA: ముఖేశ్ అంబానీ నుంచి భారీగా డబ్బు రాబట్టాలన్నదే సచిన్ వాజే ప్లాన్... ఎన్ఐఏ చార్జిషీటులో వెల్లడి

NIA submits charge sheet against Sachin Waze

  • సంచలనం సృష్టించిన ఘటన
  • అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం
  • పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్
  • చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ

అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపివేత కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీటు దాఖలు చేసింది. అంబానీ నుంచి భారీగా డబ్బు రాబట్టాలన్నదే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సచిన్ వాజే పథకం అని చార్జిషీటులో పేర్కొన్నారు.

ఈ ప్లాన్ వెనుక సూత్రధారి సచిన్ వాజేనే అని స్పష్టం చేశారు. సచిన్ వాజే గ్యాంగ్ ఉద్దేశం ఎంతో స్పష్టం అని, బాగా డబ్బు, పేరుప్రఖ్యాతులు ఉన్న ప్రముఖులను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి బాగా డబ్బు దండుకోవాలని ప్లాన్ చేశారని వివరించారు.

పోలీస్ డిపార్ట్ మెంటులో రిటైరైన వారు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారని ఎన్ఐఏ పేర్కొంది. వారిలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ కూడా ఉన్నట్టు తెలిపింది. నేరచరిత్ర ఉన్న మరో ఐదుగురు వ్యక్తులు కూడా ఆ గ్యాంగులో సభ్యులని పేర్కొంది.

సచిన్ వాజే మహారాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్నతాధికారి. కానీ దురాశతో తప్పుదారి పట్టాడు. ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన వాహనంలో సచిన్ వాజే ఓ లేఖను ఉంచి, అందులో ముఖేశ్ ను ఉద్దేశించి బెదిరించాడు. అయితే దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఇది ఉగ్రవాదుల పనే అన్నట్టుగా టెలిగ్రాం యాప్ ద్వారా ఓ సందేశం పంపాడు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం యజమాని మన్సూఖ్ హిరేన్ హత్యకు పథకం రచించింది కూడా సచిన్ వాజేనే అని ఎన్ఐఏ వెల్లడించింది.

  • Loading...

More Telugu News