Nara Lokesh: మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనంలేదు: నారా లోకేశ్
- గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం
- ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు అడ్రస్ గా మారిందన్న లోకేశ్
- పోలీసులను ప్రభుత్వం కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని మండిపాటు
మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహానికి హాజరై రాత్రి బైక్ పై ఇంటికి వెళ్తున్న దంపతులపై దుండగులు దాడి చేశారు. భర్తను కొట్టి, వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సత్తెనపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు అడ్రస్ గా మారిందని లోకేశ్ విమర్శించారు.
బైక్ పై వెళ్తున్న జంటపై దాడి చేసి, మహిళపై అమానుషానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. ఫిర్యాదు చేయడానికి బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే... అది తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనంలేదని అన్నారు. పరామర్శకు తాను వెళ్తుంటే మాత్రం వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని... అందువల్లే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పారు.