mumbai: ముంబైలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- ముంబైలో నిన్న ఒక్కరోజే 500కు పైగా కేసులు
- జులై 15 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి
- గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పెరుగుతున్న ఆందోళన
కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 43 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముంబైలో నిన్న 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జులై 15వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
రేపటి నుంచి గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ముంబైలో గణేశ్ ఉత్సవాలు భారీ ఎత్తున జరుపుకుంటారనే విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో గణేశ్ మంటపాలను ఏర్పాటు చేస్తుంటారు. పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొంటుంటారు. దీంతో, కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.