Team India: భారత టీ20 జట్టు మెంటార్‌గా ధోనీ నియామకంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంజీవ్ గుప్తా!
- లోధా కమిటీ నియమాలకు విరుద్ధమంటూ అభ్యంతరం
- మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డు మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు
- ధోనీ అనుభవం కోసమే నియామకం అని చెప్పిన గంగూలీ
టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సమయంలోనే భారత జట్టు మెంటార్‌గా అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకరైన ధోనీని నియమిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే భారత జట్టు మెంటార్‌గా ఎంఎస్ ధోనీ నియామకంపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ధోనీ నియామకం లోధా కమిటీ సంస్కరణలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ నిబంధనల ప్రకారం, ఒకే వ్యక్తి రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. దీంతో అతన్ని టీమిండియా మెంటార్‌గా నియమించడం చెల్లదని సంజీవ్ గుప్తా వాదించారు. ఈ మేరకు ఆయన బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు గెలిచిన కెప్టెన్‌గా ధోనీ అనుభవం టీమిండియా యువ ఆటగాళ్లకు ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంతోనే అతన్ని మెంటార్‌గా నియమించినట్లు గంగూలీ తెలిపారు.