Team India: భారత జట్టుపై ఇంగ్లండ్ టీమ్ ఆగ్రహం.. ఐపీఎల్ బహిష్కరించే యోచన?
- కరోనా భయంతో రద్దయిన భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్ట్
- టీమ్ ఇండియా కావాలనే చేసిందని ఇంగ్లిష్ ప్లేయర్ల అనుమానం
- ఐపీఎల్ బహిష్కరిస్తున్నారంటూ మీడియాలో కథనాలు!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో చివరి మ్యాచ్ అర్థాంతరంగా రద్దయింది. టీమ్ ఇండియా కోచింగ్ సిబ్బందిలో కొందరు కరోనా వైరస్ బారిన పడటంతో ఈ టెస్ట్ రద్దు చేశారు. దీనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ), బీసీసీఐ అధికారులు చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి టెస్ట్ గెలిస్తే సిరీస్‌ను ఇంగ్లండ్ డ్రా చేసుకునే అవకావం ఉంది. ఈ భయంతోనే భారత్ కరోనా బూచిని చూపి మ్యాచ్ రద్దయ్యేలా చేసిందని వారు ఆరోపిస్తున్నట్లు సమాచారం. కరోనా భయం ఉన్న ఆటగాళ్లు మాంచెస్టర్ వీధుల్లో ఎలా తిరుగుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారట.
ఈ కోపంలోనే యూఏఈలో జరగాల్సిన 2021 ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్ మ్యాచ్‌లను బహిష్కరిస్తామని హెచ్చరించారట. ఐపీఎల్ బహిష్కరణపై జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ మీడియా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇదే నిజమయితే బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.