Sai Dharam Tej: సాయి ధరమ్​ యాక్సిడెంట్​: డైరెక్టర్ హరీశ్ శంకర్ Vs జర్నలిస్ట్ దొంతు రమేశ్

Harish Shankar Criticizes Media On Sai Dharam Tej Accident Case

  • తప్పుడు వార్తలు అమ్ముకునేవారు బాగుండాలి
  • వాళ్లకు ఆ అన్నం అరగాలంటూ విమర్శలు
  • కౌంటర్ ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేశ్
  • తప్పుడు కథలతో కోట్లు సంపాదిస్తున్నారంటూ విమర్శ
  • అతివేగంతో ఇతరులకు ముప్పు తెస్తున్నారంటూ కౌంటర్

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు సంబంధించి మీడియాపై డైరెక్టర్ హరీశ్ శంకర్ తీవ్ర విమర్శలు చేశారు. దానికి సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేశ్ కూడా అంతే దీటుగా హరీశ్ కు కౌంటర్ ఇచ్చారు.

‘‘హ్యాట్సాఫ్ తమ్ముడు సాయి ధరమ్ తేజ్. ఆసుపత్రి బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను’’ అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.

దానికి రిప్లై ఇచ్చిన దొంతు రమేశ్.. ‘‘మీడియా వాళ్లను విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు, కథనాలు, హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరేమో కోట్లు సంపాదించుకుంటారు. మమ్మల్నేమో తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురవ్వడమే కాదు.. ఇతరుల ప్రాణాలకూ ముప్పు తెస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.

దానికి మళ్లీ హరీశ్ బదులిచ్చారు. తమ సినిమాల్లో హింసపై ఆన్సర్ చేసేందుకు తమకు సెన్సార్ బోర్డుందని, తాము దానికి జవాబుదారీగా ఉంటామని చెప్పారు. మరి, మీడియా దేనికి జవాబుదారీగా ఉందో చెబుతారా అని ప్రశ్నించారు. తాను మీడియా వ్యవస్థ గురించి మాట్లాడట్లేదని, ఆ వ్యవస్థను తప్పుదోవ పట్టించేవాళ్ల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. దయచేసి సమస్యను అర్థం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.

దానికి బదులిచ్చిన దొంతు రమేశ్.. తాము జనానికి జవాబుదారులమని చెప్పారు. జర్నలిస్టుగా ప్రశ్నించే గొంతునన్నారు. సెన్సార్ సభ్యుడిగా సెన్సార్ ఎలా చేస్తారో తనకు తెలుసని ఆయన కౌంటర్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News