Harsh Goenka: వర్క్ ఫ్రం హోం ఇకపైనా కొనసాగితే మా కాపురం కూలిపోతుంది... హర్ష్ గోయెంకాకు లేఖ రాసిన మహిళ
- కరోనా దెబ్బకు కుదేలైన కంపెనీలు
- వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా కార్యకలాపాలు
- ఏడాదిన్నరగా ఇదే విధానం
- తాము దివాలా తీస్తామన్న ఓ ఉద్యోగి భార్య
- మనశ్శాంతి కరవైందని ఆవేదన
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రముఖ కంపెనీలు సైతం ఉద్యోగులను ఇళ్ల వద్ద నుంచి పనిచేయాలని ప్రోత్సహిస్తున్నాయి. భారత్ లోనూ వర్క్ ఫ్రం హోం ఒరవడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ వ్యాపార సంస్థ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ అధినేత హర్ష్ గోయెంకాకు ఓ లేఖ అందింది. ఆర్పీజీ సంస్థలో పనిచేసే మనోజ్ అనే ఉద్యోగి భార్య ఆ లేఖ రాసింది. ప్రస్తుతం తన భర్త వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాడని తెలిపింది. వర్క్ ఫ్రం హోం విధానం ఇంకా కొనసాగితే తన కాపురం కూలిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తమ వివాహ బంధం ఎంతమాత్రం నిలవదని పేర్కొంది.
"వర్క్ ఫ్రం హోం కారణంగా నా భర్త ఇంట్లోనే ఉంటూ రోజుకు 10 పర్యాయాలు కాఫీ తాగుతున్నాడు. ఒక్క రూములో కాకుండా ఇంట్లో ఉన్న అనేక రూముల్లోకి మారుతూ చికాకు కలిగిస్తున్నాడు. తిండి, తిండి, తిండి... ఎప్పుడు చూసినా తిండి కావాలి అని అడుగుతున్నాడు. అంతేకాదు, పని వేళల్లో అతడు నిద్రపోవడం కూడా గమనించాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వారిని పెంచి పెద్దచేయాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా వర్క్ ఫ్రం హోం కొనసాగితే మేం దివాలా తీస్తాం. అందుకే మిమ్మల్ని ఈ విధానం ఎత్తివేయాలని కోరుతున్నాను" అంటూ ఆ లేఖలో పేర్కొంది.
దయచేసి తగిన చర్యలు తీసుకుని తనకు మనశ్శాంతిని ప్రసాదించాలని ఆమె అర్థించింది. హర్ష్ గోయెంకా ఆ లేఖను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆమె అభ్యర్థన పట్ల ఎలా స్పందించాలో తెలియడంలేదని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.