Akbar: సెల్ఫీ ఎఫెక్ట్... అక్బర్ భూవివాదం పరిష్కారం
- కడప జిల్లాలో భూవివాదం
- న్యాయం చేయాలంటూ సెల్ఫీలో అర్థించిన అక్బర్
- ఆత్మహత్యే శరణ్యమని ప్రకటన
- వెంటనే స్పందించిన సీఎం జగన్ కార్యాలయం
- 48 గంటల్లో సమస్య పరిష్కారమైందన్న అక్బర్
కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషా అనే వ్యక్తి తన పొలం వివాదంపై ఓ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా తీవ్ర కలకలం రేగింది. న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యే శరణ్యమని అక్బర్ పేర్కొనడంతో సీఎం జగన్ కార్యాలయం అప్రమత్తమైంది. అక్బర్ సమస్యపై దృష్టి సారించాలంటూ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, అధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేశారని బాధితుడు అక్బర్ బాషా మీడియా ముందుకొచ్చాడు. 48 గంటల్లో తన భూమి తనకు దక్కిందని చెప్పాడు. తనకు న్యాయం జరిగిందని పేర్కొన్నాడు. తమ పొలం వివాదం సమసిపోవడానికి చొరవ ప్రదర్శించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సహకార బ్యాంకు మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి కూడా ఎంతో సహకరించారని అక్బర్ వెల్లడించాడు.