Arvind Kejriwal: దేశ చరిత్రలో ఇది తొలిసారి జరుగుతోంది: కేజ్రీవాల్
- ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దిన కేజ్రీవాల్
- అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం
- 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వైనం
ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడంపై ఆప్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులను మెరుగుపరిచి... ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడేలా వాటిని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీర్చిదిద్దారు. కేజ్రీ ప్రయత్నాలు ఫలించి ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి.
దీంతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న 2 లక్షల మందికి పైగా విద్యార్థులు అక్కడి నుంచి వచ్చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయంపై 'న్యూస్ నేషన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని న్యూస్ నేషన్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచే కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తోందని కితాబునిచ్చింది. విద్యావ్యవస్థలో కేజ్రీవాల్ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారని చెప్పింది.
ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ సంస్థతో ఢిల్లీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యంత నాణ్యమైన విద్యను పొందేందుకు ఈ ఒప్పందం దోహదం చేసిందని చెప్పింది. అందువల్లే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని తెలిపింది.
విద్యావ్యవస్థలో కేజ్రీవాల్ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొచ్చిందని పేర్కొంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దేశభక్తి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకుందని చెప్పింది. విద్యార్థుల్లో దేశభక్తిని, మాతృభూమిపై ప్రేమను, గౌరవాన్ని పెంపొందించేలా కార్యాచరణను రూపొందించిందని తెలిపింది. సీబీఎస్ఈ తరహాలో సొంతంగా ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ఏర్పాటు చేసిందని చెప్పింది. ఈ బోర్డు ఏర్పాటు వల్ల ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందుతున్నారని ప్రశంసించింది.
ఈ కథనాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. రెండు లక్షలకు పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారనే దానిపై స్పందనగా... దేశ చరిత్రలో తొలిసారి ఇది జరుగుతోందని అన్నారు.