YS Sharmila: షర్మిలతో పాటు దీక్షలో కూర్చున్న విజయమ్మ
- హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ షర్మిల దీక్ష
- న్యాయం జరిగేంత వరకు దీక్షలోనే ఉంటానని ప్రకటన
- షర్మిల వద్దకు వెళ్లిన విజయమ్మ
హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే ఒక అధికారిపై చర్య తీసుకున్నారని... ఇప్పుడు ఒక చిన్నారి దారుణ హత్యకు గురైతే ముఖ్యమంత్రిలో చలనమే లేదని మండిపడ్డారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్షకు దిగుతున్నానని ప్రకటించి, ఆ వెంటనే అక్కడే దీక్షకు కూర్చున్నారు. మరోవైపు షర్మిల తల్లి విజయమ్మ కూడా అక్కడకు చేరుకున్నారు. కూతురితో పాటు దీక్షలో కూర్చున్నారు.