Prime Minister: ఆర్మీ అధికారులు ఇంకా ఆ గుర్రాల కొట్టాల్లోనే ఉండాలా?: సెంట్రల్ విస్టా ప్రాజెక్టును విమర్శిస్తున్న వారిపై ప్రధాని మోదీ మండిపాటు
- నూతన రక్షణ శాఖ కాంప్లెక్స్ లకు శంకుస్థాపన
- కీలక శాఖల ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయని కామెంట్
- వాటి గురించి వారేనాడూ పట్టించుకోలేదని మండిపాటు
- రెండో ప్రపంచ యుద్ధం నాటి కొట్టాల్లో అధికారులుంటున్నారని ఆవేదన
నూతన పార్లమెంట్ భవన సముదాయం సెంట్రల్ విస్టా గురించి విమర్శలు గుప్పిస్తున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రక్షణ శాఖలో కొత్త కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు నేతలకు కీలక మంత్రిత్వ శాఖలు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాల పరిస్థితి కన్నా వ్యక్తిగత అజెండాలే ముఖ్యమైపోయాయని ప్రధాని విమర్శించారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేశారని, అలాంటి వారు తమ సొంత అజెండాలతో తప్పుడు వార్తలను ప్రచారం చేశారని మండిపడ్డారు. మరి ప్రభుత్వ కీలక శాఖల కార్యాలయాల పరిస్థితి గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రక్షణ శాఖ కార్యాలయాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఒకవేళ వారు మాట్లాడితే వారి అబద్ధాలు బయటపడేవన్నారు.
అధికారులు నివసించేందుకు వీలుగా సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో 7 వేల గృహాలతో కొత్తగా రెండు రక్షణ శాఖ కాంప్లెక్స్ లను నిర్మించబోతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. 50 ఎకరాల్లో ఇప్పుడున్న 700 కొట్టాలను కూల్చేసి ‘ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్’గా నిర్మిస్తామన్నారు. వాస్తవానికి వాటిని గుర్రాల కోసం కట్టారని మోదీ గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆ కొట్టాల్లోనే ఆర్మీ అధికారులుంటున్నారంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు.
ఆ పరిస్థితిని తాము మార్చేస్తామని, ఆధునిక హంగులతో ఎన్ క్లేవ్ లను నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఇదంతా కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగమేనన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి ఈ విషయాలెన్నటికీ అర్థం కావన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంత అవసరమో తెలిసి వస్తుందన్నారు.