Sunil Gavaskar: ఆడే 11 మందిలో ఉంటాడా?.. అశ్విన్ ఎంపికపై గవాస్కర్ ప్రశ్న
- ఇంగ్లండ్‌లో ఎదురైన అనుభవానికి ఊరట అంటూ కామెంట్
- ఇంగ్లండ్‌లో ఒక్క టెస్టులోనూ అవకాశం దక్కని స్పిన్నర్
- 2017లో చివరి టీ20 ఆడిన వెటరన్ అశ్విన్
టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కింది. దీనిపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఇంగ్లండ్‌లో అశ్విన్‌కు ఎదురైన చేదు అనుభవానికి టీ20 ప్రపంచకప్ అవకాశం ఊరట అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
అయితే మ్యాచ్ ఆడే పదకొండు మందిలో అశ్విన్‌కు చోటు దక్కుతుందా? అని ప్రశ్నించాడు. అశ్విన్‌కు టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కడంపై చాలా మంది ఆశ్చర్యం వక్తం చేశారు. అయితే మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు గాయం కావడంతో అశ్విన్‌కు అదృష్టం కలిసొచ్చిందని సెలెక్టర్లు తెలిపారు.
అశ్విన్ చివరగా 2017లో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి ఈ ఫార్మాట్లో అవకాశం రాలేదు. ఇప్పటి వరకూ 46 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 52 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అశ్విన్‌కు ఆడే అవకాశం దక్కలేదు. మూడో టెస్టు ఓటమి తర్వాత నాలుగో టెస్టులో అశ్విన్‌కు కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు.
కానీ కోహ్లీ జట్టులో అశ్విన్‌కు స్థానం దక్కలేదు. చివరిదైన ఐదో టెస్టు రద్దవడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అశ్విన్ తన ఇంగ్లండ్ టూర్ ముగించాడు.