Gautam Gambhir: నాణ్యమైన బౌలర్లను ఎదుర్కోవడం కష్టమంటూ.. ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు
- మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో సెషన్
- తొలి సెషన్‌లో 7 మ్యాచులాడి కేవలం 37 పరుగులే చేసిన ధోనీ
- ధోనీ నుంచి ఎక్కువగా ఆశించొద్దన్న గంభీర్
టీమిండియా మాజీ సారధి ధోనీపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలో ఐపీఎల్-14 రెండో సెషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ధోనీపై టాపార్డర్ ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదని గంభీర్ అన్నాడు.
సాధారణంగా నాలుగు లేదా ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేసే ధోనీ.. ఐపీఎల్ 2021 తొలి సెషన్‌లో 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. కొన్నిసార్లు ధోనీ కన్నా ముందు శామ్ కర్రాన్ బ్యాటింగ్‌కు దిగిన సందర్భాలున్నాయని చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్‌లో పరుగులు చేయడం కష్టమేనని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఐపీఎల్ చాలా కష్టమైన టోర్నీ. ఇది కరీబియన్ లీగ్ లేదంటే మరో టోర్నీ వంటిది కాదు. దీనిలో అత్యుత్తమ బౌలర్లు పోటీ పడతారు. వారిని ప్రస్తుతం ధోనీ ఎదుర్కోవడం చాలా కష్టం’’ అని గంభీర్ అన్నాడు.
ధోనీపై చెన్నై టాపార్డర్ ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని సూచించాడు. ధోనీ కూడా వికెట్ కీపింగ్ చేస్తూ జట్టు మెంటార్ పాత్ర పోషించడంపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నాడని విశ్లేషించాడు.
కాగా, 2019 ఐపీఎల్‌లో ధోనీ అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో 416 పరుగులు చేసి చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2020 ఐపీఎల్‌లో 14 మ్యాచులు ఆడిన అతను కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 2021 ఐపీఎల్‌లో 7 మ్యాచులు ఆడి 37 పరుగులే చేసిన సంగతి తెలిసిందే.