girl: షార్ట్స్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయి.. అనుమతించక పోవడంతో కర్టెయిన్ చుట్టుకుని పరీక్ష రాసిన వైనం
- అసోంలో ఘటన
- పరీక్ష రాసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విద్యార్థిని
- కాలేజీ తీరుపై ఆగ్రహం
షార్ట్స్ వేసుకుని పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ అమ్మాయిని కాలేజీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో అ విద్యార్థిని ఓ కర్టెయిన్ చుట్టుకుని వెళ్లి పరీక్ష రాసింది. ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, జూబ్లీ తాములి (19) అపోం అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ ప్రవేశపరీక్ష రాసేందుకు వెళ్లింది.
సోనిట్‌పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో గేటు వద్ద ఆమెను సిబ్బంది అడ్డుకోలేదు. అయితే, పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో అక్కడి సిబ్బంది అడ్డుకుని, షార్ట్ ధరించి లోపలికి రాకూడదని ఆమెకు చెప్పారు.
అయితే, ఆ విషయం అడ్మిట్ కార్డ్‌లో లేదుకదా? అని ఆమె ప్రశ్నించింది. అయినప్పటికీ ఆమెను సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. ఆ సమయంలో ఆమె తండ్రి పరీక్ష కేంద్రం గేటు బయటే ఉన్నారు. దీంతో జూబ్లీ తాములికి ప్యాంట్ ఏదైనా తీసుకురావాలని ఆమె తండ్రికి అధికారులు చెప్పారు.
ఆయన వెంటనే అక్కడి నుంచి మార్కెట్‌కు పరిగెత్తారు. అయితే, అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు యువతులు జూబ్లీకి ఓ ఐడియా ఇచ్చారు. ఓ కర్టెయిన్ చుట్టుకొని వచ్చేయాలని అన్నారు. దీంతో అక్కడున్న ఓ కర్టెయిన్ చుట్టుకుని ఆమె పరీక్ష హాల్లోకి వెళ్లి పరీక్ష రాసింది. పరీక్ష రాసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కాలేజీ సిబ్బంది తీరుపై మండిపడింది.