Maharashtra: ఈడీ విచారణలో శరద్ పవార్ పేరు చెప్పిన మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే!
- కేసులో సస్పెండైన సచిన్ వాజే
- జాబ్ ఇప్పిస్తానన్న మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్
- శరద్ పవార్ ను ఒప్పించేందుకు రూ.2 కోట్లు డిమాండ్
- ఈడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ ఇంటి ముందు కారు బాంబుల కేసుకు సంబంధించి ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే సంచలన విషయాలను బయటపెడుతున్నారు. హవాలాకు సంబంధించి ఆయన్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఆ విచారణలో భాగంగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ భారీగా డబ్బు డిమాండ్ చేశాడని సచిన్ వాజే చెప్పారు.
సస్పెండైన తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను ఒప్పించేందుకు అనిల్ దేశ్ ముఖ్ రూ.2 కోట్లు డిమాండ్ చేశారని ఆయన ఈడీకి వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వ కూటమి మహా వికాస్ అఘాడీలో చాలా ప్రభావశీలమైన నేత శరద్ పవార్ అని, ఆయన చెబితే పనైపోతుందని దేశ్ ముఖ్ చెప్పారని వాజే తెలిపారు. అయితే, తనను తిరిగి తీసుకునేందకు పవార్ ఒప్పుకోలేదని, కానీ, ఆయన్ను ఎలాగైనా కన్విన్స్ చేస్తానంటూ దేశ్ ముఖ్ చెప్పారని అన్నారు.
2020 జులైలో 10 మంది డిప్యూటీ కమిషనర్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ నాటి కమిషనర్ పరంబీర్ సింగ్ ఇచ్చిన ఉత్తర్వులపై మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్, మరో మంత్రి అనిల్ పరబ్ లు అభ్యంతరం వ్యక్తం చేశారని, వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేయించారని ఆరోపించారు. తర్వాత ఆ ఇద్దరు మంత్రుల చేతికి సుమారు రూ.40 కోట్లు ముట్టాకే ఉత్తర్వులను మళ్లీ జారీ చేశారని సంచలన ఆరోపణ చేశారు.
కొన్ని కేసులకు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ తనను ఆఫీసుకు, ఇంటికి పిలిపించుకునేవారని, నేరుగా తనకు ఆదేశాలిచ్చేవారని ఆరోపించారు. మరోవైపు నగరంలోని 1,750 బార్లు, రెస్టారెంట్ల జాబితాను తనకు అనిల్ దేశ్ ముఖ్ అందించారని, ఒక్కో దాని నుంచి రూ.3 లక్షలు వసూలు చేసేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. ఆ క్రమంలోనే 2020 డిసెంబర్ నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.4.7 కోట్లు వసూలు చేశానని ఈడీకి వాజే చెప్పారు. ఈ ఏడాది జనవరిలో అనిల్ దేశ్ ముఖ్ తనకు ఫోన్ చేసి.. వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశించారన్నారు.
ఆ వెంటనే ఆయన పీఏ తనకు ఫోన్ చేసి సహ్యాద్రి గెస్ట్ హౌస్ కు రమ్మంటే వెళ్లానని, అక్కడే రూ.1.6 కోట్లున్న బ్యాగులను ఇచ్చానని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రూ.3 కోట్లు ఇచ్చానన్నారు.