Vijayashanti: ఇది విమోచనమా? లేక విలీనమా?: టీఆర్ఎస్ పై విజయశాంతి ఫైర్
- సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకున్న టీఆర్ఎస్
- కాస్త తెలివి ఉన్నవారెవరూ అలా చేయరని విజయశాంతి మండిపాటు
- విమోచన దినోత్సవాన్ని నిర్వహించే ధైర్యం టీఆర్ఎస్ కు లేదని ఎద్దేవా
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విలీన దినోత్సవంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన రోజును విమోచన దినోత్సవంగా కాకుండా... భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమయినట్టు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు విలీన దినోత్సవంగా జరుపుకున్నాయని దుయ్యబట్టారు. కాస్త తెలివి ఉన్నవారెవరూ అలా చేయరని అన్నారు. స్వాతంత్ర్యం అంటే రాక్షస రజాకార్ల నియంతృత్వం నుంచి విమోచనమా? లేక భారదేశంలో విలీనమా? అని ప్రశ్నించారు. దుష్టుల దుర్మార్గాల నుంచి బయటపడితే విమోచనమే అంటారని అన్నారు.
తాలిబన్ల పాలన నుంచి ఆప్ఘనిస్థాన్ ప్రజలు పోరాడి విముక్తులైతే అది విమోచనం అవుతుందా? కాదా? అని విజయశాంతి ప్రశ్నించారు. లేకపోతే పాకిస్థాన్ లాంటి దుష్టదేశాలు చేసే దుష్ప్రచారం ప్రకారం విద్రోహమవుతుందా? అని అడిగారు. రజాకార్ల నుంచి విముక్తి పొందినందుకు సెప్టెంబర్ 17వ తేదీని కాస్త తెలివి ఉన్న ఎవరైనా విమోచన దినంగానే పాటిస్తారని చెప్పారు. విలీన దినోత్సవం అంటూ టీఆర్ఎస్ పార్టీ దీన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తోందని... విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే ధైర్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని అన్నారు.