Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం.. ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
- టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవలే ప్రకటన
- తాజాగా మరో ప్రకటనతో అభిమానులకు షాక్
- కెరియర్ ఉన్నంత వరకు ఆర్సీబీతోనే ఉంటానని స్పష్టీకరణ
- కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న ఆర్సీబీ
టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి ఇటీవల షాకిచ్చిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తున్న కోహ్లీ.. బెంగళూరుకు కెప్టెన్గా ఇదే తన చివరి ఐపీఎల్ అని ప్రకటించి అభిమానులను విస్మయపరిచాడు.
అయితే, తన కెరియర్ ముగిసే వరకు మాత్రం బెంగళూరుతోనే ఉంటానని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అంత తేలిక కాకపోయినప్పటికీ ఫ్రాంచైజీ ప్రయోజనాల కోసం సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రకటించినప్పటి నుంచే ఈ విషయంపైనా ఆలోచించానని, సహచర ఆటగాళ్లతోనూ చర్చించానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీకి నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయమని, స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. ఈ అవకాశం కల్పించిన బెంగళూరు మేనేజ్మెంట్కు, కోచ్లు, ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశాడు.
కోహ్లీ అనూహ్య నిర్ణయంపై ఆర్సీబీ యాజమాన్యం స్పందించింది. బెంగళూరు జట్టుకు కోహ్లీ గొప్ప ఆస్తి అని, అతడి నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆర్సీబీ చైర్మన్ ప్రథమేశ్ మిశ్రా అన్నారు. కాగా, బెంగళూరు తరపున ఇప్పటి వరకు 199 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 5 శతకాలతో 6076 పరుగులు చేశాడు.