IPL 2021: కోల్కతా బౌలర్ల విజృంభణ.. 92 పరుగులకే బెంగళూరు ఆలౌట్
- చెరో మూడు వికెట్లు కూల్చిన వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్
- 5 పరుగులకే కోహ్లీని పెవిలియన్ చేర్చిన ప్రసిద్ధ్ కృష్ణ
- 20 పరుగుల మార్కు దాటిన ఒకే ఒక్కడు దేవదత్ పడిక్కల్
ఐపీఎల్ రెండో సెషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు శుభారంభం లభించలేదు. ఈ ఏడాది టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న ఈ జట్టు కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో 92 పరుగులకే చాపచుట్టేసింది. టాస్ గెలిచిన కోహ్లీ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ రెండో ఒవర్లోనే కోహ్లీ (5)ని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.
ఆ సమయంలో దేవదత్ పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) కాసేపు నిలబడ్డారు. ఆ తర్వాత పడిక్కల్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక అప్పటి నుంచి బెంగళూరు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (10), డివిలియర్స్ (0), సచిన్ బేబీ (7), వానిందు హసరంగ్ (0), కైల్ జేమీసన్ (4), హర్షల్ పటేల్ (12), మహమ్మద్ సిరాజ్ (8), యుజ్వేంద్ర చాహల్ (2 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు.
కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి, ఫెర్గూసన్ రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కోల్కతా ముందు 93 పరుగుల లక్ష్యం ఉంది.