England: న్యూజిలాండ్ బాటలోనే ఇంగ్లండ్... పాకిస్థాన్ టూర్ రద్దు చేసుకున్న ఈసీబీ
- ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పాలన
- పొరుగుదేశాలపై ప్రభావం
- పాకిస్థాన్ వచ్చేందుకు భయపడుతున్న విదేశీ జట్లు
- ఇటీవల చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్న కివీస్
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించడం ఏమో కానీ, పాకిస్థాన్ క్రికెట్ పై ఆ ప్రభావం తీవ్రస్థాయిలో పడుతోంది. భద్రతా కారణాల రీత్యా పలు జట్లు పాకిస్థాన్ టూర్ రద్దు చేసుకుంటున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ మరికాసేపట్లో వన్డే మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా, మా ప్రభుత్వం ఈ టూర్ కు అంగీకరించడం లేదంటూ అర్థాంతరంగా నిష్క్రమించింది. ఇప్పుడదే బాటలో ఇంగ్లండ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది.
ఇంగ్లండ్ పురుషుల, మహిళల జట్లు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల నుంచి పర్యటించాల్సి ఉంది. ఇంగ్లండ్ పురుషుల జట్టు అక్టోబరు 13, 14 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఇంగ్లండ్ మహిళల జట్టు అక్టోబరు 17 నుంచి 21 వరకు మూడు వన్డేల సిరీస్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే, కివీస్ క్రికెట్ బోర్డు తరహాలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా భద్రతా పరమైన అంశాలను చూపుతూ పర్యటనకు తాము రాబోవడంలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సమాచారం అందించింది.
తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యమే తమకు అత్యంత ప్రాధాన్యతాంశమని ఈసీబీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ కు ప్రయాణించడం ఏమంత క్షేమకరం కాదని భావిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ఒత్తిళ్ల నడుమ తమ ఆటగాళ్లను పంపించలేమని వివరించించింది. ఇప్పటికే తమ ఆటగాళ్లు కొవిడ్ సంబంధిత ఆంక్షలతో దీర్ఘకాలంగా ఒత్తిడిలో ఉన్నారని ఈసీబీ పేర్కొంది.
పాకిస్థాన్ లో అంతర్జాతీయ క్రికెట్ కు పునరుజ్జీవం కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పీసీబీ పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని, అందుకే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని ఆ ప్రకటనలో వెల్లడించింది.