Ramiz Raja: పర్యటనలు రద్దు చేసుకున్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు... అక్కసు వెళ్లగక్కిన పాక్ క్రికెట్ చీఫ్
- భద్రత కారణాలతో పాక్ లో విదేశీ జట్ల పర్యటనలు రద్దు
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రమీజ్ రాజా
- పాశ్చాత్య దేశాలన్నీ ఒకటేనని విమర్శలు
- అవసరమైతే ఏకమవుతారని వ్యాఖ్యలు
ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అనూహ్యరీతిలో పాకిస్థాన్ పర్యటన రద్దు చేసుకోగా, ఇంగ్లండ్ కూడా తమ పురుషుల, మహిళల జట్లను పాకిస్థాన్ పంపబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తన అక్కసు వెళ్లగక్కారు. ఈ పాశ్చాత్య దేశాల తీరే అంత అని విమర్శించారు. అవసరమైతే వారు ఏకమవుతారని, ఒకరికొకరు సహకరించుకుంటారని వ్యాఖ్యానించారు.
ఇటీవల న్యూజిలాండ్ ఎలాంటి కారణాలు చెప్పకుండానే భద్రత పేరుతో వెళ్లిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఇప్పుడు తీవ్ర ఆవేశంతో ఉన్నామని రమీజ్ రాజా స్పష్టం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ఇరుదేశాల క్రికెట్ సంబంధాలు విచ్ఛిన్నమయ్యేలా వ్యవహరించిందని ఆరోపించారు.
పాక్ క్రికెట్ జట్టు ఈ పరిణామాల నుంచి బలమైన జట్టుగా అవతరించాలని, ప్రతి జట్టు పాకిస్థాన్ జట్టుతో ఆడాలని కోరుకునే స్థాయికి ఎదగాలని రమీజ్ రాజా పిలుపునిచ్చారు. మరే ఇతర జట్టుకు ఇలాంటి కారణాలు చెప్పే అవకాశం ఇవ్వనంతగా పాక్ జట్టు ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు.