CPI Narayana: ఢిల్లీలో పలుకుబడి ఉన్నప్పటికీ గట్టిగా ఎందుకు అడగడం లేదు?: పవన్ కల్యాణ్ పై నారాయణ విమర్శలు
- స్టీల్ ప్లాంట్ పై పవన్ కల్యాణ్ చేసే పోరాటంపై నమ్మకం లేదు
- 222 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే మీకు కనపడలేదా?
- బీజేపీతో ఇక్కడ గుద్దులాట, అక్కడ ముద్దులాటా?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే పోరాటంపై తమకు నమ్మకం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత 222 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం జరుగుతుంటే పవన్ కు కనపడలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో చేసిన ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ, మీరు రాలేదని విమర్శించారు. ఢిల్లీలో మీకు పలుకుబడి ఉన్నప్పటికీ... మీరు గట్టిగా వారిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
బీజేపీతో ఇక్కడ గుద్దులాట, అక్కడ ముద్దులాటా? అని విమర్శించారు. చేతకాకపోతే చెప్పాలని, ప్రజలను మాత్రం మోసం చేయవద్దని కోరారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే కచ్చితంగా పోరాడాల్సిందేనని నారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పారు. ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఉందని అన్నారు. ఈ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించాలని కోరారు.