Anti Vaccine: ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు
- ఆస్ట్రేలియాలో మళ్లీ పెరుగుతున్న కేసులు
- ఒక్క డోసైనా వేసుకున్న కార్మికులే పనులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశం
- నిరసిస్తూ ఆందోళనకు దిగిన కార్మికులు
- హింసాత్మకంగా మారడంతో నిర్మాణ రంగ పనులు రెండు వారాలపాటు నిలిపివేత
విక్టోరియా, న్యూ సౌత్వేల్స్లలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హింసకు దారితీసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలోని కార్మికులు కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నాకే పనికి వెళ్లాలని ఆదేశించింది.
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెల్బోర్న్లో వందలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మెల్బోర్న్లో నిర్మాణ రంగ పనులను రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.