Apps: 8.13 లక్షల యాప్ లపై నిషేధం.. వెంటనే ఫోన్ల నుంచి తీసేయమంటున్న నిపుణులు
- ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగింపు
- 86 శాతం పిల్లలను ప్రభావితం చేసేవే
- గోప్యతా నిబంధనలను ఉల్లంఘించిన 66 శాతం చైనా యాప్ లు
- వెల్లడించిన పిక్సలేట్ నివేదిక
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 లక్షల యాప్ లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నిషేధం విధించాయి. ‘హెచ్1 2021 డీలిస్టెడ్ మొబైల్ యాప్స్ రిపోర్ట్’ పేరిట పిక్సలేట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆ రెండు సంస్థలు 8.13 లక్షల యాప్ లపై నిషేధం విధించాయి. అందులో 86 శాతం యాప్ లు 12 ఏళ్ల లోపు చిన్నారులను ప్రభావితం చేసే యాప్ లే ఉన్నాయని నివేదిక పేర్కొంది. అందులో ప్లే స్టోర్ లోని 86 శాతం, యాప్ స్టోర్ లోని 89 శాతం యాప్ లు పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది.
యాప్ స్టోర్ విధానాలను ఉల్లంఘించడం లేదా డెవలపర్ విత్ డ్రా కావడం వంటి కారణాలే యాప్ ల నిషేధానికి కారణమై ఉంటుందని పిక్సలేట్ పేర్కొంది. అందులో గూగుల్ ప్లే స్టోర్ లోని 25 శాతం, యాపిల్ లోని 59 శాతం యాప్ లు సంస్థల పాలసీలను ఉల్లంఘించాయని వెల్లడించింది. డీలిస్ట్ చేసిన యాప్ లలో 26 శాతం రష్యాకు చెందినవని, అవన్నీ పాలసీలను ఏ మాత్రం పాటించట్లేదని నివేదిక చెప్పింది. చైనాకు చెందిన 60 శాతం యాప్ లు గోప్యతా నిబంధనలను పాటించట్లేదని పేర్కొంది.
గూగుల్ ప్లే స్టోర్ డీ లిస్ట్ చేసిన యాప్ లలో 66 శాతం యాప్ లు ‘ప్రమాదకరమైన’ పర్మిషన్లను అడుగుతున్నాయని నివేదిక హెచ్చరించింది. అందులో 27 శాతం యాప్ లు జీపీఎస్ యాక్సెస్, 19 శాతం కెమెరా యాక్సెస్ ను అడుగుతున్నాయని వెల్లడించింది. మొత్తంగా 50 లక్షల మొబైల్ యాప్ లపై పరిశీలన జరిపామని, 2.1 కోట్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది.
ప్లేస్టోర్, యాప్ స్టోర్ లు డీలిస్ట్ చేసిన ఆ యాప్ లు కోట్లాది ఫోన్లలో ఇంకా ఉన్నాయని వెల్లడించింది. వెంటనే ఆ యాప్ లను ఫోన్ నుంచి వెంటనే డిలీట్ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్టోర్ విధానాలను ఉల్లంఘించే యాప్ ల నుంచి ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.