Pakistan: ఒక్క డిమాండ్‌తో అంతర్జాతీయంగా ఒంటరైపోయిన పాకిస్థాన్!

Pakistan Isolated After Bid To Get Taliban Included In SAARC Meet

  • సార్క్ సమావేశంలో తాలిబన్లకు చోటివ్వాలని డిమాండ్
  • ఆఫ్ఘనిస్థాన్ గత ప్రభుత్వ ప్రతినిధి గులాం ఇసాక్‌జాయ్‌కు అనుమతి వద్దు
  • సమావేశం నిర్వహిస్తున్న నేపాల్ నుంచి లిఖితపూర్వక హామీ అడిగిన పాకిస్థాన్
  • ఒంటరిగా డిమాండ్ చేసిన పాక్.. గొంతు కలపని సభ్య దేశాలు
  • సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశం రద్దు

దాయాది పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ వేదికలపై సాయం చేయడానికి ప్రయత్నిస్తున్న పాక్‌కు ఇది కచ్చితంగా షాకే. నేపాల్‌లో మరికొన్ని రోజుల్లో సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరగాల్సి ఉంది. దీనిలో బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొనాల్సి ఉంది.

అయితే ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో వారికి ఈ సమావేశంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో తాలిబన్ ప్రభుత్వానికి సమావేశంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. అలాగే ఆఫ్ఘన్‌లో కుప్పకూలిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ప్రాతినిధ్యం వహించిన గులాం ఇసాక్‌జాయ్‌ను సమావేశంలోకి అనుమతించవద్దని కోరింది. ఈ మేరకు సమావేశానికి ఆతిథ్యమిస్తున్న నేపాల్ నుంచి లిఖితపూర్వక హామీ కోరింది.

అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఏ దేశమూ ఇప్పటి వరకూ గుర్తించలేదు. రష్యా, చైనా కూడా తాలిబన్లకు కొంత సహకరిస్తున్నట్లే కనిపించినా ఆ దేశాలు కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలో వారిని సార్క్ సమావేశంలో అనుమతించడం సమంజసం కాదనేది మిగతా సభ్యదేశాల వాదన. భారత్ కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదన్న సంగతి తెలిసిందే.

ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్నికి ఎటువంటి అధికారాలూ లేవని, అలాంటి ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం పొందడం కుదరదని భారత ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఆ దేశ ఉద్దేశ్యాలను బట్టబయలు చేసిందని ఈ ఉన్నతాధికారులు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News