china: భారత్‌పై చైనా సంస్థ సైబర్ దాడి: అమెరికా సంస్థ వెల్లడి
- భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా చోరీ
- మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి కూడా డేటా తస్కరణ
- చైనా ప్రభుత్వ సాయంతో హ్యాకర్ల కార్యకలాపాలు
- గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన వైనం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)పై చైనా సైబర్‌దాడి చేసిందని అమెరికాకు చెందిన రికార్డెడ్ ఫ్యూచర్ అనే ప్రైవేటు సైబర్ భద్రత కంపెనీ పరిశోధక విభాగం తెలిపింది. అలాగే, మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి కూడా చైనా హ్యాకర్లు సమాచారాన్ని తస్కరించారని పేర్కొంది.
చైనా హ్యాకర్లు తమ దేశ ప్రభుత్వ సహకారంతోనే ఈ దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. చైనా హ్యాకర్లు విన్టీ అనే మాల్‌వేర్ సాయంతో ఈ సైబర్ దాడి చేశారని తెలిపింది. ఈ మాల్‌వేర్ చైనాలో ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో ఈ సైబర్ దాడి వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఉందని తెలుస్తోంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారతీయ సంస్థలపై చైనా హ్యాకింగ్ కార్యకలాపాలు భారీగా పెరిగిపోయాయని రికార్డెడ్ ఫ్యూచర్ చెప్పింది. గత ఏడాది కంటే ఈ ఏడాది చైనా హ్యాకర్ల కార్యకలాపాలు 261 శాతం అధికంగా నమోదయ్యాయని తెలిపింది.
చైనాకు చెందిన ఓ కంపెనీ విన్టీ మాల్‌వేర్‌తో సైబర్ దాడులకు పాల్పడిందని పేర్కొంది. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ నెట్‌వర్క్ నుంచి 500 మెగాబైట్ల డేటాను ఆ చైనా సంస్థ తస్కరించింది. అయితే, అందులో ఎలాంటి సమాచారం ఉందన్న విషయంపై స్పష్టతలేదు.
భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచేలా చైనా చర్యలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి 5 మెగాబైట్ల డేటాను ఓ చైనా సంస్థ అపహరించినట్లు తెలుస్తోంది. ఉడాయ్‌పైన చైనా ఈ ఏడాది జూన్, జులైల్లో హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఇప్పటికే వెల్లడైంది. దాదాపు 10 మెగాబైట్ల డేటాను తస్కరించింది. భారత్‌లోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉడాయ్‌పై చైనా హ్యాకర్లు దాడి చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.