Medicine: నీట్ లో భారీ స్కామ్.. గుర్తించిన సీబీఐ!
- రూ.50 లక్షలకో మెడిసిన్ సీటు
- నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించేందుకు కోచింగ్ సెంటర్ ఎత్తు
- మహారాష్ట్రలో వెలుగు చూసిన స్కామ్
- కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, విద్యార్థుల అరెస్ట్
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ లో సీబీఐ అధికారులు భారీ కుంభకోణాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని ఆర్కే ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ అనే ఓ కోచింగ్ సెంటర్ ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా తేల్చారు. అభ్యర్థికి బదులుగా వేరొకరితో పరీక్ష రాయించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ సీటు ఇప్పించేలా ఆ కోచింగ్ సెంటర్ ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఈ కుంభకోణానికి సంబంధించి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరిమళ్ కొత్పల్లివార్ తో పాటు పలువురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కుంభకోణంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పరిమళ్ పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకున్నారని, పనయ్యాక పూర్తి మొత్తం చెల్లించేందుకుగానూ షూరిటీగా విద్యార్థుల టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకున్నారని సీబీఐ ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
విద్యార్థుల పరీక్ష ఐడీ, పాస్ వర్డ్ లను సేకరించి అందులో మార్పులు చేసి అసలైన అభ్యర్థులకు బదులు నకిలీ అభ్యర్థులను పరీక్షకు పంపించేందుకు పరిమళ్, అతడి అనుచరులు ఏర్పాట్లు చేశారని ఎఫ్ఐఆర్ లో వెల్లడించినట్టు సమాచారం. అనుమానం రాకుండా అభ్యర్థుల ఫొటోలు, నకిలీ అభ్యర్థుల ఫొటోలను మిక్సింగ్ తో పాటు మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు.
నకిలీ ఐడీ కార్డులను తయారు చేసేందుకు అభ్యర్థుల ఈ–ఆధార్ కార్డులనూ తీసుకున్నారని, ఓఎంఆర్ షీట్ లనూ మార్చేందుకూ పరిమళ్ హామీ ఇచ్చారని ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ నెల 12న ఐదుగురు నకిలీ అభ్యర్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఎగ్జామ్ కేంద్రం వద్ద సీబీఐ అధికారులు కాపుగాసినా.. వారు పరీక్షా కేంద్రానికి రాలేదని ఓ అధికారి చెప్పారు.