CPI Ramakrishna: జగన్ గారూ.. సీఎం కుర్చీని కూడా అదానీకి ఇచ్చేయండి: సీపీఐ రామకృష్ణ ఎద్దేవా
- ఆంధ్రప్రదేశ్ ను అదానీప్రదేశ్ గా మార్చేస్తున్నారు
- అదానీకి విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్ సంస్థలను కట్టబెడుతున్నారు
- జగన్, అదానీల రహస్య భేటీ వివరాలను బయటపెట్టాలి
ఆంధ్రప్రదేశ్ ను అదానీప్రదేశ్ గా మార్చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. జగన్, గౌతమ్ అదానీల మధ్య జరిగిన రహస్య భేటీ వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీకి జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ పేరుతో ఏకంగా 9 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాన్ని కల్పిస్తూ ఏపీ కేబినెట్ లో హడావుడిగా తీర్మానాలు చేశారని విమర్శించారు. నాలుగు, ఐదు కంపెనీలకు దక్కాల్సిన ప్లాంట్లను అదానీ ఒక్కడికే కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ కు కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులను కుట్రపూరితంగా కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామకృష్ణ దుయ్యబట్టారు. ఏపీలోని విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్ సంస్థలను అదానీకి అప్పగించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నో బడా సంస్థలు, పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ... అన్నీ గుజరాత్ సంస్థలకే కట్టబెట్టడం వెనకున్న మర్మమేంటని అడిగారు. ముఖ్యమంత్రి కుర్చీని కూడా అదానీకి ఇచ్చేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు.