USA: ఆకస్ గ్రూపులో మరే దేశాన్నీ చేర్చుకోవడం లేదు: అమెరికా స్పష్టీకరణ
- చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు ఆకస్ గ్రూపు ఏర్పాటు
- ఆస్ట్రేలియాకు బ్రిటన్ అణ్వాయుధ జలాంతర్గాముల సాంకేతికత
- భారత్, జపాన్ దేశాలు చేరతాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన అమెరికా
చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ఏర్పాటు చేసిన ఆకస్ గ్రూపులో భారత్, జపాన్ లేవని అమెరికా గుర్తు చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆకస్ గ్రూపు పని చేయనుంది. ఇందులో భాగంగా బ్రిటన్ తన వద్ద ఉన్న అణ్వాయుధ జలాంతర్గాముల సాంకేతికతను ఆస్ట్రేలియాకు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో ఆసియాలోని కీలక దేశాలైన భారత్, జపాన్‌లను కూడా ఈ గ్రూపులో చేర్చే అవకాశం ఉందని వస్తోన్న ప్రచారంపై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మీడియా సమావేశంలో స్పందిస్తూ ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.
ఈ నెల 15న ఆకస్ గ్రూపును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారని చెప్పారు. ఇందులో మరే దేశాన్నీ చేర్చుకోవడం లేదని ఫ్రాన్స్‌కు కూడా బైడెన్ స్పష్టం చేశారని తెలిపారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల చతుర్భుజ కూటమి (క్వాడ్) సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ అమెరికాకు చేరుకున్నారు. మిగతా దేశాల అధినేతలూ అమెరికా వెళ్తున్నారు. ఈ సమావేశానికి అమెరికా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆకస్ గ్రూపు అంశం కూడా చర్చనీయాంశమైంది.