IPL: మా రికార్డ్ ఘనం.. వాటిని నేను నమ్మను: రోహిత్ శర్మ
- కోల్ కతాపై గెలుపు సులువు కాదన్న ముంబై కెప్టెన్
- ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని కామెంట్
- ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తేనే గెలుపన్న హిట్ మ్యాన్
ఐపీఎల్ 2021 రెండో అంచె మొదటి మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా దూరమయ్యాడు. గాయం కారణంగా ముందు జాగ్రత్తగా టీమ్ మేనేజ్ మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది. చెన్నైతో జరిగిన ఆ మ్యాచ్ లో ముంబై ఓడిపోయింది. ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
ఈ నేపథ్యంలోనే కోల్ కతాతో మ్యాచ్ అంత సులభమైనదేం కాదని, గెలుపు ఈజీ కాదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. బెంగళూరును మట్టికరిపించిన కేకేఆర్ కు బ్రేకులు వేయాలంటే తాము తీవ్రంగా శ్రమించాల్సిందేనని స్పష్టం చేశాడు. కోల్ కతా ఇప్పుడు పటిష్ఠ స్థితిలో ఉందని రోహిత్ చెప్పాడు. గత మ్యాచ్ లో సమష్టిగా రాణించి.. మరో గెలుపు కోసం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందన్నాడు. అయితే, గత రికార్డులను తాను పట్టించుకోనని, మ్యాచ్ ఆడే నాటి పరిస్థితులే తమకు ముఖ్యమని చెప్పాడు.
మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే తప్పకుండా గెలుస్తామన్నాడు. కేకేఆర్ మీద తమ రికార్డ్ బాగుందనేది నిజమేనని, గత రికార్డులపై తనకు నమ్మకం లేదని, ప్రయత్నాల్లో లోపం లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నాడు. కాగా, ఇప్పటిదాకా కోల్ కతా, ముంబైలు 28 సార్లు తలపడగా.. ముంబై 22 సార్లు గెలిచింది. కోల్ కతా కేవలం ఆరు మ్యాచ్ లలోనే నెగ్గింది.