Mekathoti Sucharitha: కొప్పర్రులో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డది నిజమే అయితే మీడియాలో ఎందుకు చూపించలేదు?: సుచరిత
- గుంటూరు జిల్లా కొప్పర్రులో ఘర్షణలు
- వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడి
- వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారన్న సుచరిత
- నిజాలు తెలియజెప్పేందుకే వచ్చానని వెల్లడి
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కాగా, కొప్పర్రులో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్త శ్రీకాంత్ ను ఇంట్లోకి తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేశారని వివరించారు. మరో వైసీపీ కార్యకర్తకు కన్ను పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ ఘర్షణల్లో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని అంటున్నారని, అదే నిజమైతే వారిని మీడియాలో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. మీడియా ఉన్నది వాస్తవాలు వెల్లడించడానికని హితవు పలికారు.
రాజకీయ ప్రయోజనాల కోసం బీభత్సకర వాతావరణం సృష్టించడం హేయమని సుచరిత పేర్కొన్నారు. పైగా, టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి వైసీపీపైనే ఆరోపణలు చేస్తున్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని భయానక పరిస్థితులు కల్పిస్తున్నారని అంటున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణల నేపథ్యంలో నిజాలు తెలియజెప్పేందుకే తాను కొప్పర్రు వచ్చానని వెల్లడించారు.
టీడీపీ కార్యకర్తలు పక్కా ప్లాన్ తో 100 మందిని కూర్చోబెట్టి ఘర్షణకు దారితీసేలా వ్యవహరించారని ఆరోపించారు. వీడియోల్లో చూస్తే ఎవరేం చేశారో వెల్లడవుతుందని అన్నారు. పార్టీ శ్రేణులకు అన్ని వేళలా అండగా ఉంటామని సుచరిత స్పష్టం చేశారు.