Jagan: ఫ్రంట్ లైన్ వర్కర్లను వాడుకుని రోడ్డున పడేశారు: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన మండిపాటు
- జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది
- కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ మూడో స్థానంలో ఉంది
- కక్ష సాధింపులకే జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శలు గుప్పించారు. జగన్ చేతకానితనం వల్ల రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దశల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.
దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో ఏపీ మూడో స్థానంలో ఉందని... ఇదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందని దుయ్యబట్టారు. అయినప్పటికీ వ్సాక్సినేషన్ కార్యక్రమంలో తొలి స్థానంలో ఉన్నామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిడ్డారు. ఏపీలో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోందని చెప్పారు.
ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. వైద్యసేవల కోసం ఫ్రంట్ లైన్ వర్కర్లను వాడుకుని... ఆ తర్వాత వారిని రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. జీతాల కోసం ఆందోళన చేసే వారిపై లాఠీఛార్జ్ చేయిస్తున్నారని చెప్పారు. ప్రజా హితాన్ని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి... కక్ష సాధింపులకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.